కేసీఆర్ గొప్ప నిర్ణయం: తెలుగు తప్పనిసరి

updated: March 21, 2018 14:15 IST
కేసీఆర్ గొప్ప నిర్ణయం:  తెలుగు తప్పనిసరి

తెలుగు బాషకు, పాటకూ తెలంగాణా సామాజిక చైతన్యానికి విడదీయలేని సంబంధం ఉన్నదన్న సంగతి తెలిసిందే. అమ్మ నోటి పదాల నుండి  పల్లె పాటను, ఆనాటి వీధి నాటకాలు యక్ష గానాలు, ఉద్యమ పాటలు తెలంగాణా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. బండి యాదగిరి రాసిన 'బండెనక బండికట్టి', సుద్దాల హనుమంతు రాసిన 'పల్లెటూరి పిల్లగాడ', గద్దర్ పాడిన 'పొడుస్తున పొద్దు మీద', గోరటి వెంకన్న పాడిన 'నాగేటి సాల్లలో నా తెలంగాణా', గూడ అంజయ్య రాసిన 'ఊరు మనదిరా' లాంటి పాటలు తెలంగాణా ప్రజలను ఉద్యమ బాట పట్టించి, ఉద్యమానికి సైరన్ లా పనిచేశాయి.. అటువంటి మహనీయులను గౌరవించి, తెలుగు వైభవానికి కృషి చేస్తోంది ప్రభుత్వం. 

అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వరకూ పాఠశాలలు, కళాశాలల్లో తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయనుంది. 2018-19వ విద్యాసంవత్సరం నుంచి తెలుగును ప్రథమ భాషగా అమలు చేయనుంది. అమలు చేయని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడానికి ఆర్డినెన్స్‌ అవకాశం కల్పిస్తోంది.  

సీబీఎస్‌ఈ పాఠశాలల్లో విద్యాసంవత్సరం మార్చి 25నే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకుంది. 2018-19లో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఇది తప్పనిసరి. మైనారిటీ విద్యాసంస్థలపట్ల ఎలాంటి వైఖరి ఉండాలనే అంశాన్ని సర్కారు చర్చిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన బడులు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ పాఠశాలలు, అన్ని ఇంటర్మీడియట్‌ కాలేజీల్లో తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరి చేస్తూ ఆర్డినెన్స్‌  జారీ అవుతుందని ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: telugu

comments